రచన నిజాయితీగా ఉంటే సరిపోతుందా…, ఆ రచన చేసిన రచయత కూడా నిజాయితీగా ఉండాలా. రెండవదే ధర్మం. ఈ ధర్మాన్ని రచనలు చేసినంత కాలం నిర్వర్తించిన రచయత శ్రీ త్రిపురనేని మహారధి. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. త్రిపురనేని మహారధి వయసు 82ఏళ్లు. సినీ రచయతగా మంచి జోరుమీదున్న రోజుల్లో నాలుగు రూపాయలు వెనకేసుకోవాలనుకునే వారు ఉంటారు. కాని త్రిపురనేని మాత్రం రూపాయల కంటే రచనలే మిన్న అనుకున్నారు. విపరీతంగా అవకాశాలు చేతిలో ఉన్నప్పుడు వాటిని వదులుకొని అడువుల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ తిరుగుతూ అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఆ సినిమానే హీరో కృష్ణకు, రచయతగా మహారధికి అజరామరమైన గుర్తింపు తెచ్చింది. బంధిపోటు, అన్నదమ్ముల సవాల్, పాడి పంటలు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దొంగలు, దేశోద్ధారకులు వంటి సినిమాలకు ఆయన రచన చేశారు. రైతు భారతం, దేశమంటే మనుషులోయ్ వంటి సామాజిక స్పృహ ఉన్న సినిమాలను నిర్మించారు. రచయతగా మంచి పేరు ఉన్న కాలంలోనే త్రిలింగ ప్రజాప్రగతి అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే కొన్నాళ్ళకే ఆ పార్టీ మరుగున పడిపోయింది. త్రిపురనేనిది ముక్కుసూటి మనస్తత్వం. నచ్చిని విషయాన్నైనా, నచ్చనిది అయినా ముఖం మీదే చెప్పే మనస్తత్వం ఆయనది. నందమూరి తారక రామారావు కు ఈయన బాల్య స్నేహితుడు.
Recent Comments